Thursday, April 8, 2010

ఆరో రుచి


(ఉగాది రచనల పోటీకి పంపిన కథ యొక్క ప్రతి )
" రామా కనవేమిరా .. శ్రీ రఘు రామ కనవేమిరా...
రమణీ లలామ.. నవ లావణ్య సీమ.. ధరాపుత్రి సుమధాత్రి .. నడయాడి రాదా.."
స్వాతిముత్యం సినిమాలోని పాట.. నాకు ఎంతో ఇష్టమైనది... మంద్రంగా వినిపిస్తోంది రేడియోలో ...నా అభిమాన సంగీత దర్శకుడు ఇళయరాజా గీతం. విదేశం లో కూడా స్వదేశపు స్మృతులని గుర్తుకి తెస్తూ ఉంది కారు స్టీరియో కి అనుసంధానం చేసిన ఐఫోన్. అప్రయత్నంగా ఆలోచనలు గతంలోకి తీసుకెళ్ళాయి.. అప్పుడు నాకూ ఆరేళ్ళు వుంటాయేమో..
                         *******************************
"ఛీ చేదుగా వుంది. నాకొద్దు" అన్నా రామాలయం లో పూజారి గారు ఇచ్చిన ఉగాది పచ్చడి నోట్లో పడగానే.. చివాట్లు వెయ్యడానికి సిద్దమవుతున్న మా నాన్నని సున్నితంగా వారించింది మా బామ్మ. " తప్పురా బంగారం అలా అనకూడదు" అంది బెల్లం ముక్క నా నోట్లో వేస్తూ . " మరి నాకూ" అంది మా అమ్మ ఒడిలో కూర్చోని ఉన్న నా చెల్లెలు బుంగమూతి పెడుతూ. "నీక్కూడా లేవే" అంది దానికి కూడా ఒక ముక్క ఇచ్చింది నవ్వేస్తూ . మా ఊరు చిత్తూరు జిల్లా లోని దేవరదిన్నె గ్రామం .మేము వుండేది తిరుపతి. వీలైనప్పుడల్లా ఇలా ఉగాదికి మా కుటుంబం, అత్తయ్య వాళ్ళ కుటుంబం, ఇంకా బాబాయ్ వాళ్ళు అందరం కలుస్తూ ఉంటాం. అలా కలిసినప్పుడు కుటుంబ సమేతంగా మా ఊరి రాముల వారి ఆలయానికి వెళ్లి పంచాంగ శ్రవణం విని, ఉగాది పచ్చడి తినడం ఒక సంప్రదాయంగా వస్తోంది.

" బామ్మ పచ్చదేందుకు అలా వుంతుంది " అంది మా చెల్లి ముద్ద ముద్దగా మా అమ్మ ఒడిలో నుంచి అత్తయ్య ఒడిలోకి మారుతూ..దానికి మా బామ్మ పిల్లలందరిని ఒక చోట చేర్చి ఒక్కొక్కరికి కొబ్బరిముక్క ఇస్తూ "ఒరేయ్ పిల్లలూ, ఉగాది పచ్చడి అంటే చేదు, వగరు, పులుపు, కారం,ఉప్పు, తీపి అనే ఆరు రుచుల సమ్మేళనం. వీటన్నింటిని కలిపి తిన్నప్పుడు ఒక్క రుచి లాగ నాలుకకు తగలక పోవచ్చు కాని మీ మనసులో ఏ రుచి అయితే అనుకుంటారో అది మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. జీవితంలో కూడా అంతే. భయం, ఆనందం, కష్టం, ఆలోచన,ఆవేదన అన్ని కలిసి వుంటాయి. అన్ని సమపాళ్ళలో ఉంటేనే జీవితం పరిపూర్ణంగా వుంటుంది.మొదటి ఐదింటిని రుచి చూసినప్పుడే ఆరో రుచిని ఆనందించగలం. మీ మనసులో ఉన్న అనుభూతే మీకు తగిలే రుచి" అంది.

"ఈ విషయం నాకు ముందే తెలుసుగా" అన్నా నేను తల ఎగరేస్తూ..
" నీకు తెలుసని నాకు తెలుసు లేరా బంగారం" అంది నన్ను దగ్గరకి తీస్కుని నవ్వేస్తూ.. అప్పట్లో ఆమె చెప్పింది అర్ధం కాకపోయినా సరే రెప్ప వాల్చకుండా వినేవాళ్ళం. కాని అందులోని ఆంతర్యం వయసు పెరిగే కొద్దీ అవగతం అయింది. చిన్నప్పుడు ఉగాది పచ్చడి ఎప్పుడు తీయగానే అనిపించేది. కారణం ఎటువంటి ఆలోచనలు లేని బాల్యం కావచ్చు లేక మా బామ్మ ప్రేమతో కొంచెం ఎక్కువగా వేసిన బెల్లం కావచ్చు. ఎప్పుడు సెలవులకి మా బామ్మ వాళ్ళ ఊరేల్లినా పిల్లలందరితో ఇల్లు సందడిగా వుండేది. అంతమందిలోను నేనంటే మా బామ్మకి అభిమానం ఎక్కువ.

తర్వాత కాలక్రమంలోలో ఎన్నో మార్పులు .. మా చదువులు, ఎంసెట్ , ఇంజనీరింగ్, చెల్లెలి పెళ్లి .. ఇలా వీటి గొడవల్లో తరచూ మా ఊరెల్లడం తగ్గింది. మా బామ్మ కూడా ఆరోగ్యరీత్యా మాతోపాటు తిరుపతి వచ్చేసింది. కాని ఎప్పుడు కుదిరినా మా బామ్మతో కలిసి తిరుపతిలో రామాలయానికి వెళ్ళేవాడిని . ఆ రామాలయం చాలా పురాతనమైనది . నాలుగు మాడ వీధులతో మరియు విశాలమైన ప్రాంగణంతో చాలా చక్కగా వుంటుంది. ప్రతి ఉగాదికి ఏ ఊర్లో ఉన్నా దగ్గరలోని రామాలయాని వెళ్లి ఉగాది పచ్చడి తిని, మా బామ్మ చెప్పినట్లు ఏదో ఒక రుచి వెతికేవాడిని. ఇంజనీరింగ్ అయిపోగానే కాంపస్ లో వచ్చిన ఉద్యోగరీత్యా హైదరాబాదులో స్థిరపడ్డాను. ఆ ఏడాది ఉగాదికి కాకతీయనగర్ లోని రామాలయానికి వెళ్ళినప్పుడు మొదటి సారి పల్లవిని చూసాను. లంగావోణిలో బుట్టకమ్మలు, వాలుజడతో అచ్చం బాపు బొమ్మలా ఎంతో ఒద్దికగా వుంది. . ఇంతలో పూజ అయిపోవడంతో వెళ్లి ప్రదక్షిణలు చేసి ప్రసాదం తీస్కోని వచ్చేసరికి మాయం అయింది. ఎక్కడికి వెళ్లి ఉంటుందా అని ఆలోచిస్తూ పచ్చడి నోట్లో వేస్కున్నా. కొంచెం పుల్లగా అనిపించింది. కాని తన ప్రశాంతమైన మోము, కల్మషం లేని నవ్వు,తీక్షణమైన చూపులు నా మనసులో అలా ఉండిపోయాయి.

తర్వాత ఆరు నెలలకు ఒక ప్రొజెక్ట్ కోసం బెంగుళూరు నుంచి టీం వస్తే ఆ మీటింగ్ కి వెళ్ళా, అక్కడే మళ్లీ కనిపించింది పల్లవి, కాకపోతే వేషధారణ పూర్తిగా ఆధునికంగా వుంది బాపు బొమ్మ డావిన్సి మోనాలిస అయిందా అనేలా. " ఐ యామ్ పల్లవి" అంది ప్రేసేంటేషన్ మొదలు పెడుతూ.. నాకు ఆ గళం ఇళయరాజా యుగళం లాగ వినపడింది. ప్రేసేంటేషన్ సాంతం తన తీరు,ఆత్మ విశ్వాసం,మధ్యలో ప్రశ్నలడిగినప్పుడు పాటించిన సంయమనం నేను తన వైపు ఆకర్షితుడయ్యేలా చేసింది.. ప్రొజెక్ట్ లో ఇద్దరం కీలక వ్యక్తులు కావడం, ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడం,తను కూడా ఇళయరాజా అభిమాని కావడం, ఒకరి అభిరుచులు మరొకరికి నచ్చడం వలన సహజంగానే ఇద్దరి మధ్య ఇష్టం ప్రేమగా మారి పెళ్లి చేసుకుందామనే నిర్ణయం వరకు వెళ్ళింది. సహజంగా ప్రేమ పెళ్లి అనగానే మన దేశంలో వచ్చే మొదటి అభ్యంతరం కులం. మేము అందుకు అతీతులం కాదు.పల్లవి వాళ్ళ తల్లితండ్రులది కూడా ప్రేమ వివాహం కావడంతో వారిని ఒప్పించడం పెద్ద కష్టం కాలేదు. పల్లవి నాన్నగారు ఈ విషయం మాట్లాడడానికి ఓ రోజు మా ఇంటికి వచ్చారు. విషయం విన్నాక మా నాన్న అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. కాని నన్ను ఆశ్చర్య పరచిన విషయం మా బామ్మ. నన్ను సమర్దిస్తున్ధనుకుంటే తను బ్రతికుండగా ఇంకో కులం అమ్మాయితో నా పెళ్ళికి ఒప్పుకోనంది. నన్ను వలలో వేస్కుందని పల్లవిని, ఏ ధైర్యంతో వచ్చావని వాళ్ళ నాన్నని తిట్టి పోసింది. ఖిన్నుడైన ఆయన ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోతూ నాతో పల్లవిని మర్చిపొమ్మని చెప్పి వెళ్ళిపోయారు.

ఇంట్లో వాళ్ళతో నేను చేసిన వాదనలు వ్యర్ధం అయ్యాయి. నాన్న కొంచెం మెత్తబడ్డా బామ్మ మాత్రం ససేమిరా అని భీష్మించుకు కూర్చుంది. పల్లవి వాళ్ళ నాన్నకి జరిగిన అవమానానికి చాలా బాధ పడింది,నన్ను ఏమి అనలేక,నా నిస్సహాయతను అంగీకరించలేక మాటయినా చెప్పకుండా అక్కడ నుంచి రాజీనామా చేసి వెళ్లిపోయింది. నేను చుక్కాని లేని నావలా తయారయ్యాను. ఎందుకు ఆఫీసుకి వెళ్తున్నానో ,ఎం చేస్తున్నానో అర్ధం కాని స్థితి. ప్రతి చోట పల్లవి తో గడిపిన క్షణాలే గుర్తుకు వచ్చేవి. ఆరు నెలలు ఇంటికి కూడా వెళ్ళలేదు, బామ్మతో మాట్లాడలేదు. తర్వాత బామ్మ ఆరోగ్యం సరిగా లేదని నాన్న కబురు చేస్తే వెళ్ళాను. నన్ను చూడగానే మంచం పట్టి ఉన్న బామ్మ ఒక్కసారి లేచింది."నేను పోయాక గాని రాకుడదని అనుకున్నావేంట్రా" అంది కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ. "అమ్మా రామాలయానికి వెళ్తున్న ఎవరైనా వస్తారా" అని మా అమ్మతో అని లోపలి వెళ్ళిపోయా వెంటనే. బామ్మ ఒక్కటే తయారయ్యి వచ్చింది నాతో పాటు. గుడిలో పూజ అయ్యాక మండపంలో కూర్చున్నాం.
"అయితే నాతో మాట్లాడవురా బంగారం"
"ఈ ముసలి వయసులో నాకీ శిక్ష ఏంట్రా" అంది గద్గద స్వరంతో.
వెంటనే తలెత్తి అన్నా "మనకి ఇష్టమైన వాళ్ళు మనకి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో అర్ధమైందా బామ్మా. నా పరిస్థితి అంతే"అన్నా
"అయితే మమ్మల్ని వదిలి ఆ అమ్మాయి తోటే వెల్లలేకపోయావా" అంది కాసింత కోపంగా
" బామ్మా నువ్వు చిన్నప్పుడు ఎప్పుడు అనేదానివే అన్ని రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి అని.. ఓ విషయం చెప్పనా. అందులో ఏ రుచి లేకపోయినా అసలు ఆ పచ్చడికి విలువే లేదు. నా జీవితం కూడా అంతే. మీరందరు ఐదు రుచులయితే పల్లవి ఆరో రుచి. తను లేకుండా నా జీవితం ఎప్పటికి సంపూర్ణం కాలేదు." మా బామ్మా రెండు చేతులు పట్టుకొని సూటిగా చూస్తూ అడిగా "చెప్పు బామ్మా.నా కోసం పల్లవితో నా పెళ్లి జరిపిస్తావా? మరి నా జీవితాన్ని సంపూర్ణం చేస్తావా?". మా బామ్మా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి "ఇన్ని పురాణాలూ, ఇన్ని ఇతిహాసాలు చదివినా అవగతం కాని ఒక గొప్ప సత్యాన్ని నేను నేర్పిన విషయం ద్వారానే నాకు నేర్పావు. వెళ్ళు నాన్నా వెళ్ళు నీ జీవితం లోని ఆరో రుచిని తీసుకురా " అంది మనస్పూర్తిగా..
"ఇలా అంటావని నాకు ముందే తెలుసుగా" అన్నా నేను అలవాటుగా తల ఎగరేస్తూ..
" నీకు తెలుసని నాకు తెలుసు లేరా బంగారం" అంది నన్ను దగ్గరకి తీస్కుని నవ్వేస్తూ..
                          ******************************
" డేస్టినేషన్ అరైవ్డ్" అన్న జీపీఎస్ మాటలకి ఈ లోకంలో వచ్చి పడ్డా. కార్ పార్క్ చేసి పిట్స్ బర్గ్ గుడిలోకి అడుగుపెట్టా.. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదూ. మా బామ్మా ఆశీర్వాదంతో పల్లవి వాళ్ళ నాన్నాని కలిశా.ఆయన విషయం తెలిసి సంతోషించారు. పల్లవి అలిఘని ప్రొజెక్ట్ మీద డేలాయిట్ తరపున పిట్స్ బర్గ్ లో పని చేస్తోంది అని చెప్పారు. నేను ఆయన్ని కలసిన విషయం పల్లవికి చెప్ప వద్దని మాట తీసుకున్నా. నేను హెచ్ 1 మీద హారిస్ బర్గ్ లో జాబు సంపాదించా. ఈ రోజు ఉగాది. ఖచ్చితంగా పల్లవి గుడికి వస్తుందని నా మనస్సు చెబుతోంది . ఇదిగో ఇప్పుడు తనని కలిసి ఆశ్చర్య పరుద్దామనే వెళ్తున్నా. పండుగ కదా జనం బాగానే వున్నారు.ఈ జనసందోహంలో తనని ఎలా వెతికి పట్టుకోవాలా అని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళా. దేవుని దర్శనం తర్వాత ఓ పక్కన ఉగాది పచ్చడి పెడుతుంటే తీస్కుంటూ ఉండగా వినిపించిది.

"రామా కనవేమిరా .. శ్రీ రఘు రామ కనవేమిరా..." ఎవరిదో ఫోన్ రింగ్ టోన్.
ఏదో గుర్తు వచ్చిన వాడిలా ఒక్కసారి వెనక్కి తిరిగా.. కళ్ళల్లో ఆనందబాష్పాలతో నా బాపు బొమ్మ ఇటే చూస్తోంది ఇది కలా నిజామా అన్నట్లు. తన వైపు వెళ్తూ చేతిలోని పచ్చడిని నోట్లో వేస్కున్నా. తీయగా తగిలింది.

Here We Go...

Welcome to Guru Govindam. After keeping it idle for a looooong long time i started writing something albeit junk.This one will be mostly in Telugu(lemme see how it works).. I started this blog to satisfy the other side of me n to check my writing skills. I am starting with a story i sent for a local program in Harrisburg,PA....So here we go...